Vijay Deverakonda:వెండితెరపై హిట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరోసారి కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత దాదాపు ఏడేళ్ల విరామంతో ఈ జంట ‘రణబాలి’లో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీరిద్దరూ.. ఓ ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియాలో ఎదురవుతున్న ట్రోలింగ్‌పై ఆసక్తికరంగా స్పందించారు.
‘ఓవరాక్టింగ్’ అంటూ విమర్శలు :
యూట్యూబర్ కీర్తిక గోవిందసామితో జరిగిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా తన వ్యక్తిత్వంపై వచ్చే విమర్శల గురించి మాట్లాడారు. తాను ఇతరులతో ఆప్యాయంగా, సానుకూలంగా ఉండటాన్ని కొందరు ‘ఓవరాక్టింగ్’, ‘క్రింజ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
తన దృష్టిలో మంచితనం ఎప్పటికీ బలహీనత కాదని రష్మిక స్పష్టం చేశారు. చుట్టూ ప్రతికూలత పెరుగుతున్న సమయంలో కనీసం నాలుగు మంచి మాటలు మాట్లాడి, ఇతరుల్లో కొంతైనా సానుకూలత నింపాలని తాను భావిస్తానని చెప్పారు. తన తీరు కొందరికి నచ్చకపోయినా దాని గురించి పెద్దగా పట్టించుకోనని తెలిపారు. ప్రతి ఒక్కరికీ అందరూ నచ్చాలనే నిబంధన ఏమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.
ముసుగు వేసుకుని జీవించలేను :
ఇతరులను మెప్పించేందుకు తన సహజమైన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం తనకు అసలు ఇష్టం లేదని రష్మిక స్పష్టం చేశారు. తాను నిజంగా ఎలా ఉంటానో తన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు బాగా తెలుసని పేర్కొన్నారు. వారి ప్రేమ, సంతోషం తనకు ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎవరి కోసం తన సహజమైన ప్రవర్తనను మార్చుకోనని, తాను తనలా ఉన్నప్పుడే నిజమైన ఆనందాన్ని అనుభవిస్తానని రష్మిక వెల్లడించారు.
ALSO READ:Akhanda 3:చిరంజీవి–బాలకృష్ణ మల్టీస్టారర్‌పై బోయపాటి క్రేజీ కామెంట్స్.. !
నెగిటివిటీ వెనుక వ్యవస్థ ఉందన్న విజయ్ :
రష్మిక వ్యాఖ్యలకు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కూడా మద్దతు తెలిపారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌లో కొంత భాగం ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కలవకుండా, వారితో సమయం గడపకుండా వారి స్వభావంపై పూర్తి స్థాయి అభిప్రాయానికి ఎలా వస్తారని విజయ్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించడం చాలా సులభమైందని, ఒక వ్యక్తిపై ప్రతికూల అభిప్రాయాన్ని పెంచేందుకు కొందరు ప్రత్యేకంగా వ్యవస్థలను నడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి ప్రచారాన్ని చూసి ఎవరూ తమ సహజమైన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని విజయ్ స్పష్టం చేశారు.
ALSO READ:Rakul Preet Singh: ఐటీ సోదాలు, బినామీ ఆస్తులు.. రకుల్ ప్రీత్ సింగ్ సంచలన క్లారిటీ!
అక్టోబర్ 16న ‘రణబాలి’ విడుదల :
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ 19వ శతాబ్దపు దక్షిణ భారత నేపథ్యంతో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఆంగ్లేయుల పాలనలో కరువు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ఓ వీరుడి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.




