Roja:సీనియర్ నటి, మాజీ రాజకీయ నాయకురాలు రోజా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, స్టార్ హీరోలతో ఉన్న అనుబంధాలు, వ్యక్తిగత జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్‌తో కలిసి సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కమల్ హాసన్‌తో సినిమా ఎందుకు చేయలేదు?
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఎంతోమంది అగ్ర హీరోలతో కలిసి నటించిన రోజా(Roja).. కమల్ హాసన్‌తో మాత్రం ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. దీనిపై ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురుకాగా, ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కమల్ హాసన్‌తో నటించకపోవడం వెనుక ఎలాంటి పరిస్థితులు లేదా ఇతరుల ఒత్తిడి లేదని, అది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ఆయనతో కలిసి నటించాలనే ఆసక్తి తనకు లేదని నేరుగా చెప్పినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.
also read:Samantha:సమంత డెలివరీ డేట్ చెప్పిన స్నేహితురాలు..!
రజినీకాంత్‌తో ఆ మధురమైన జ్ఞాపకం :
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించిన రోజా.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రజినీకాంత్ షూటింగ్ సమయంలో ఎంతో సరదాగా ఉంటారని, తోటి నటీనటులతో ఆటపట్టిస్తూ నవ్వులు పూయించేవారని తెలిపారు. ఒకసారి లంచ్ బ్రేక్ తర్వాత తాను ఈజీ చైర్‌లో నిద్రపోతుండగా, రజినీకాంత్ స్వయంగా గొడుగు పట్టుకుని తనకు నీడనిచ్చారని చెప్పారు. అంతేకాకుండా నిద్రిస్తున్న తన ఫొటోలు కూడా తీశారని, ఆ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేనని నవ్వుతూ వివరించారు.
also read:Chiranjeevi:దేశాలు దాటిన మెగాస్టార్ క్రేజ్.. అమెరికాలో చిరంజీవి పాటకు అదిరిపోయే డ్యాన్స్!
చిరంజీవి సరదా కామెంట్.. సెల్వమణిపై ప్రశంసలు
దర్శకుడు సెల్వమణిని ప్రేమించిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి తనను సరదాగా ఆటపట్టించేవారని రోజా తెలిపారు. “నీకు తెలుగువాళ్లు దొరకలేదా.. తమిళ వ్యక్తిని ప్రేమించావా?” అంటూ చమత్కరించేవారని గుర్తు చేసుకున్నారు. అనంతరం తన భర్త సెల్వమణి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు.
సినిమా తప్ప మరో ఆలోచన ఉండదని, మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వారి ఎదుగుదలకు మద్దతుగా నిలుస్తారని చెప్పారు. మహిళా సాధికారతపై ఆయనకు ఎంతో గౌరవం ఉందని, పుస్తకాలు చదవడం కూడా ఆయనకు చాలా ఇష్టమని వెల్లడించారు. సెల్వమణి తండ్రి ఉపాధ్యాయుడైనప్పటికీ, సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇంటి నుంచి వచ్చి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి దర్శకుడిగా ఎదిగారని వివరించారు.
ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్న రోజా!
సినిమాల్లోకి రాకముందు తనకు ఎయిర్ హోస్టెస్ కావాలనే కోరిక ఉండేదని రోజా తెలిపారు. అయితే ఆ ఉద్యోగంలోని సవాళ్ల గురించి తెలుసుకున్న తర్వాత ఆ ఆలోచనను పక్కన పెట్టినట్లు చెప్పారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే తన అభిప్రాయాలను, గళాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఇలా తన సినీ, వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను రోజా ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.




