Sowcar Janaki:ప్రముఖ సీనియర్ నటిగా పేరు సంపాదించిన షావుకారు జానకి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె వయసు 95 సంవత్సరాలు. శ్వాస కోస సమస్యలతో గత వారం రోజుల నుంచి చెన్నైలోని కావేరి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. నిన్నటి రోజున రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
వెంటిలేటర్ పై చికిత్స..
ప్రస్తుతం షావుకారు జానకి వెంటిలేటర్ మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. 1950లో విడుదలైన షావుకారు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన జానకి దాదాపుగా 450కు పైగా చిత్రాలలో నటించింది. ఇందులో 200 చిత్రాలలో హీరోయిన్గా నటించి మెప్పించింది. షావుకారు జానకి పరభాష చిత్రాలలో కూడా తన పాత్రలకు స్వయంగా డబ్బింగు చెప్పుకునేది. తన తొలి చిత్ర సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకొని గుర్తింపు సంపాదించుకున్న ఈమె తెలుగు ,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలోనే కాకుండా మరికొన్ని భాషలలో కూడా నటించింది. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శివాజీ గణేష్ జెమినీ గణేష్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించిన షావుకారు జానకి భారతీయ సినిమాకు ఆమె అందించిన సేవలకు గాను 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.
షావుకారు జానకి ఆరోగ్యం పై ఆందోళన..
షావుకారు జానకి 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించింది. తన అందం అభినయంతో ఐదు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన జానకి హీరోయిన్ గానే కాకుండా సహాయనటిగా కూడా పలు చిత్రాలలో నటించి మెప్పించారు. షావుకారు జానకి ఆరోగ్య పరిస్థితి విని అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరి షావుకారు జానకి హెల్త్ అప్డేట్ పై కుటుంబ సభ్యులు కానీ వైద్యులు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
షావుకారు జానకి కెరియర్..
షావుకారి జానకి పూర్తి పేరు శంకరమంచి జానకి.. ఈమె రంగస్థలం నాటకాలతో కళా రంగంలోకి ప్రవేశించింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి సహా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకుంది. షావుకారు జానకి సోదరి కృష్ణకుమారి కూడా తెలుగు సినీ పరిశ్రమలో పలు చిత్రాలలో కథానాయికగా నటించింది.




