BIGG BOSS:బిగ్ బాస్ తెలుగు 10లో 12వ రోజు కెప్టెన్సీ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. కెప్టెన్ కావాలనే లక్ష్యంతో కంటెండర్లు పలు దశల్లో పోటీపడ్డారు. చివరకు ఝాన్సీ తన పట్టుదల, వేగంతో తుది పోటీలో విజయం సాధించి ఈ సీజన్‌లో తొలి కెప్టెన్‌గా నిలిచారు. చివరి రౌండ్‌లో రామ్ ప్రసాద్‌తో తలపడిన ఆమె.. టాస్క్‌ను ముందుగా పూర్తి చేసి కెప్టెన్సీని దక్కించుకున్నారు. అనంతరం బిగ్ బాస్(BIGG BOSS) ఝాన్సీని అభినందించి ప్రత్యేక కెప్టెన్ రూమ్‌ను కేటాయించారు.
ఐదుగురు కంటెండర్ల మధ్య పోటీ :
ఈ వారం కెప్టెన్సీ కోసం ముఖేష్, షాలిని, ఝాన్సీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ ఎంపికయ్యారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఈ ఐదుగురిని జైలులో ఉంచారు. మిగిలిన హౌస్‌మేట్స్ గార్డులుగా వ్యవహరించగా, వంశీ, రోహిత్ వారికి నాయకత్వం వహించారు.
జైలు గేట్లు తెరుచుకున్న వెంటనే కంటెండర్లు బయటకు వచ్చి గోడను దాటి సేఫ్ జోన్‌కు చేరుకోవాలి. అయితే తమకు కెప్టెన్‌గా నచ్చని కంటెండర్‌ను అడ్డుకునే అధికారం గార్డులకు ఇచ్చారు. ప్రతి రౌండ్‌లో గార్డుల చేతికి చిక్కిన కంటెండర్ తదుపరి పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
షాలినిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు :
టాస్క్ మొదలైన తర్వాత గార్డులు కంటెండర్లను నిలువరించేందుకు రంగంలోకి దిగారు. వర్షిణి, నరేష్, దేబ్జానీ తదితరులు షాలినిని లక్ష్యంగా చేసుకుని ఆమె సేఫ్ జోన్‌కు చేరకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముఖేష్ గోడ దాటి సేఫ్ జోన్‌లోకి వెళ్లగలిగారు. ఝాన్సీని అడ్డుకునేందుకు కూడా గార్డులు ప్రయత్నించారు.
షాలినిని నిలువరించడంలో గార్డుల దృష్టి ఎక్కువగా ఉండటంతో ఝాన్సీకి అవకాశం లభించింది. ఆమె ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సేఫ్ జోన్‌లోకి చేరుకున్నారు. అయితే షాలినిని అడ్డుకునే సమయంలో వర్షిణి చేసిన కొన్ని వ్యాఖ్యలు హౌస్‌లో చర్చకు దారితీశాయి.
ALSO READ:Agadha OTT:ఆత్మలు.. క్షుద్రశక్తి.. భయంకరమైన మిస్టరీ.. ఓటీటీలోకి ‘అగధ’!
వయసు వ్యాఖ్యలపై షాలిని అభ్యంతరం:
రామ్ ప్రసాద్‌ను కెప్టెన్‌గా చూడాలని కోరుకుంటున్నామని, షాలినికి వయసు, అనుభవం తక్కువగా ఉండటంతోనే ఆమెను అడ్డుకుంటున్నామని వర్షిణి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై షాలిని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కెప్టెన్సీకి వయసును ప్రమాణంగా ఎందుకు తీసుకొస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఆటలో తన వయసును ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. కెప్టెన్ కావాలంటే ఎక్కువ వయసు ఉండాలనే నిబంధన ఏదీ లేదని స్పష్టం చేశారు. దీంతో ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాద వాతావరణం కనిపించింది.
ALSO READ:Panchanama:ఓటీటీలో రికార్డ్ సృష్టించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్
తుది పోటీలో రామ్ ప్రసాద్‌తో ఝాన్సీ :
కెప్టెన్సీ టాస్క్ తదుపరి దశలకు చేరుకున్న కొద్దీ పోటీ మరింత ఉత్కంఠగా మారింది. గార్డులు ముఖేష్, త్రిగుణ్‌ను అడ్డుకోవడంతో వారు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో చివరి దశలో ఝాన్సీ, రామ్ ప్రసాద్ మాత్రమే మిగిలారు.
తుది టాస్క్‌లో భాగంగా కట్టర్‌ను ఉపయోగించి ఫెన్సింగ్‌ను కట్ చేసి అవతలి వైపుకు వెళ్లాలి. అక్కడ ఉన్న కెప్టెన్సీ జెండాను ముందుగా ఎగురవేసిన వ్యక్తి విజేతగా నిలుస్తారు. ఈ పోటీలో ఝాన్సీ వేగంగా టాస్క్‌ను పూర్తి చేసి రామ్ ప్రసాద్‌పై ఆధిక్యం సాధించారు.
దీంతో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ నిలిచారు. విజయం అనంతరం హౌస్‌లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తగా, బిగ్ బాస్ ప్రత్యేక కెప్టెన్ గదిని కూడా కేటాయించారు.




