All of Us Are Dead Season 2:కొరియన్ వెబ్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జాంబీ, హారర్, సర్వైవల్ అంశాలతో తెరకెక్కిన ‘ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్’ తొలి సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌కు భారత్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు దాదాపు నాలుగేళ్లుగా సీజన్ 2 (All of Us Are Dead Season 2)కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు కీలక అప్‌డేట్ వచ్చింది. రెండో సీజన్ చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే? :
‘ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్’ తొలి సీజన్ 2022 జనవరిలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సిరీస్‌కు వచ్చిన స్పందనతో అదే ఏడాది జూన్‌లో రెండో సీజన్‌ను అధికారికంగా ప్రకటించారు. అయితే నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టింది. 2025 జులైలో సీజన్ 2 షూటింగ్ మొదలవగా, 2026 ఫిబ్రవరిలో చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.
రెండో సీజన్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు జాంబీ ఎఫెక్ట్స్, వీఎఫ్‌ఎక్స్ పనులు ఎక్కువగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్‌కు సమయం పడుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకు అధికారిక స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయితే ఎనిమిది ఎపిసోడ్లతో రూపొందుతున్న ఈ సీజన్ 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
also read:Fauzi Movie:ఫౌజీ సినిమా నుంచి లీకైన వీడియో వైరల్..!
ఈసారి కథ సియోల్‌కు షిఫ్ట్ :
మొదటి సీజన్‌లో ఎక్కువ భాగం కథ హ్యోసాన్ హైస్కూల్ చుట్టూనే తిరిగింది. అయితే రెండో సీజన్‌లో కథా పరిధిని మరింత విస్తరించినట్లు తెలుస్తోంది. సియోల్ నగరం ఈసారి ప్రధాన నేపథ్యంగా ఉండనుంది. తొలి సీజన్‌లో ప్రాణాలతో బయటపడిన నామ్ ఓన్-జో యూనివర్సిటీలో చదువుకుంటూ సాధారణ జీవితానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది.
ఇదే సమయంలో నగరంలో మరోసారి జాంబీ వైరస్ వ్యాప్తి చెందడం కథలో కొత్త ఉత్కంఠకు తెరతీస్తుంది. ఓన్-జోతో పాటు కొత్త పాత్రలు కూడా వైరస్ బారిన పడకుండా ప్రాణాల కోసం పోరాడనున్నాయి. నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు చెందిన అధికారుల ప్రవేశంతో కథ మరింత ఆసక్తికరంగా మారనుంది.
also read:VK Naresh:సినిమాలకు ప్రాంతీయ ముద్రలా? వీకే నరేష్ సంచలన వ్యాఖ్యలు
పాత నటులతో పాటు కొత్త ముఖాలు :
సీజన్ 2లో తొలి భాగంలో కనిపించిన పలువురు నటులు తమ పాత్రలను కొనసాగించనున్నారు. పార్క్ జీ-హు, యూన్ చాంగ్-యాంగ్, చో ఈ-హ్యూన్, లోమోన్ తదితరులు మళ్లీ కనిపించనున్నారు. వీరితో పాటు లీ మిన్-జే, కిమ్ సీ-యున్, రో జే-వోన్, యూన్ గా-ఈ వంటి కొత్త నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సీజన్ 2పై భారీ అంచనాలు :
మొదటి సీజన్‌లో జాంబీలతో పాటు ‘హ్యాంబీ’ కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పూర్తిగా జాంబీగా మారకుండా మానవ లక్షణాలను కొనసాగించే పాత్రలు కథకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఇదే అంశం సిరీస్‌కు భారీ విజయాన్ని అందించింది. తొలి 28 రోజుల్లోనే ఈ సిరీస్‌కు 560 మిలియన్ గంటల వీక్షణ సమయం నమోదైనట్లు నెట్‌ఫ్లిక్స్ గణాంకాలు వెల్లడించాయి. 90కి పైగా దేశాల్లో టాప్-10లో నిలిచిన ఈ సిరీస్‌కు సీజన్ 2పై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి.




