Tyson Naidu:టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా, నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘టైసన్ నాయుడు’. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈసారి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే పలు కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బెల్లంకొండ :
తాజాగా విడుదలైన టీజర్‌ను పరిశీలిస్తే.. ‘టైసన్ నాయుడు’( Tyson Naidu) ఒక ప్రత్యేక ఆపరేషన్ చుట్టూ తిరిగే కథగా కనిపిస్తోంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అత్యంత శక్తిమంతమైన పోలీస్ అధికారిగా కనిపించారు. సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ అశాంతిని సృష్టించే వ్యక్తులను అడ్డుకోవడానికి పోలీస్ శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. అదే స్పెషల్ ఆపరేషన్ టీమ్. ఈ బృందానికి నాయకుడిగా శ్రీనివాస్ బాధ్యతలు చేపడతారు.
ఈ టీమ్ చేసే ఆపరేషన్లలో సాధారణ అరెస్టులు ఉండవు. అధికారిక రికార్డులకు కూడా చోటు ఉండదు. అయితే ఈ క్రమంలో ఒక వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడం కథలో కీలక మలుపుగా కనిపిస్తోంది. అతడు ఎలా తప్పించుకున్నాడు? దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి? ఆ కుట్రను శ్రీనివాస్ ఎలా బయటపెట్టాడు? చివరకు ప్రత్యేక బృందం తమ లక్ష్యాన్ని చేరుకుందా? అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
also read:ENE Repeat :ENE రిపీట్ మూవీ రివ్యూ.. నవ్వులే నవ్వులు.. సినిమా ఎలా ఉందంటే?
ఆకట్టుకుంటున్న యాక్షన్ సన్నివేశాలు :
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పోలీస్ పాత్రలు కొత్తేమీ కాకపోయినా.. ఈ సినిమాలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ హెడ్‌గా ఆయన కనిపిస్తున్న తీరు ప్రత్యేకంగా ఉంది. టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, ఆయన బాడీ లాంగ్వేజ్ పాత్రకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. టీజర్‌లో కథకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకుండా ఉత్కంఠను కొనసాగించారు.
ఇక ఈ సినిమాలో రావు రమేష్, నరేష్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నేహా శెట్టి కూడా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. భీమ్స్ సిసిరోలియో అందిస్తున్న సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశముంది.
also read:Actress Diya Mirza:బాలీవుడ్ నటుడు పై.. నటి దియా మీర్జా సంచలన కామెంట్స్!
విడుదల కోసం ఎదురుచూపులు :
యాక్షన్, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాల కలయికతో ‘టైసన్ నాయుడు’ తెరకెక్కుతున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. సాగర్ చంద్ర దర్శకత్వం, బెల్లంకొండ శ్రీనివాస్ పవర్‌ఫుల్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.




