Nithin:టాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నితిన్ మరో ఆసక్తికరమైన సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమాకు మురళీకాంత్ దేవసోత్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
అమాయకుడి వెనుక ఆసక్తికరమైన రహస్యం:
ఈ సినిమాలో నితిన్ కృష్ణ అనే ఫ్యామిలీ కోర్టు స్టెనోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నారు. బయటకు ఎంతో అమాయకంగా, పద్ధతిగా కనిపించే అతడి జీవితంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం ఉంటుంది. రొమాంటిక్ పుస్తకాలు చదువుతున్నాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తే, అతడు వాటిని చదవడం లేదని, స్వయంగా రాస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోతారు. అయితే ఆ పుస్తకాలను తన పేరుతో కాకుండా ఓ అమ్మాయి పేరుతో రాస్తుండటం కథలో అసలైన ట్విస్ట్‌గా కనిపిస్తోంది.
అందుకే ట్రైలర్ చివర్లో వచ్చే ‘ఇప్పుడు మిమ్మల్ని కృష్ణ అని పిలవాలా? లేక రుక్మిణి అని పిలవాలా?’ అనే డైలాగ్ సినిమాకు పెట్టిన టైటిల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాన్ని తెలియజేస్తోంది. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల్లో నవ్వులు పూయించేలా ఉన్నాయి.
పెళ్లిచూపుల సన్నివేశాలు హైలైట్ :
ట్రైలర్లో పెళ్లిచూపులకు సంబంధించిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరుసగా ముగ్గురు అమ్మాయిలు కృష్ణను తిరస్కరించిన తర్వాత నాలుగో పెళ్లిచూపులకు వెళ్లే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్ను నితిన్ అడిగే ప్రశ్న, దానికి ఆమె ఇచ్చే సమాధానం, వెంటనే హీరో చెప్పే కౌంటర్ డైలాగ్ చాలా సహజంగా, సరదాగా సాగుతాయి.
‘నీకిది ఎన్నో పెళ్లిచూపులు?’ అని నితిన్ అడగ్గా.. ‘నన్ను ఎంతమంది రిజెక్ట్ చేశారో తెలుసుకోవడానికా?’ అని హీరోయిన్ ప్రశ్నిస్తుంది. అందుకు ‘లేదు.. నన్ను కలవడానికి మీరు ఎంతమందిని రిజెక్ట్ చేశారో తెలుసుకుందామని’ అంటూ నితిన్ చెప్పే సమాధానం నవ్వులు తెప్పిస్తోంది.
also read:Bhavana:సీరియల్ నటీనటుల సంపాదన వెనుక ఇన్ని కష్టాలా? నటి భావన షాకింగ్ కామెంట్స్!
నవ్వులతో పాటు భావోద్వేగాలు:
మొదట సరదా సన్నివేశాలతో ఆకట్టుకునే ట్రైలర్, ఆ తర్వాత క్రమంగా భావోద్వేగాల వైపు మళ్లుతుంది. ప్రేమ, విరహం, మనసులోని సంఘర్షణలను దర్శకుడు ఆసక్తికరంగా చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నితిన్ (Nithin)ఏడుస్తూ తన భావాలను వ్యక్తపరిచే సన్నివేశం ఆకట్టుకుంటోంది. ‘ఏడుస్తానయ్యా.. నా ఫీలింగ్ నా ఇష్టం.. నీకేం నొప్పి? ఏడుస్తా బరాబర్ ఏడుస్తా!’ అనే డైలాగ్ పాత్రలోని భావోద్వేగ తీవ్రతను తెలియజేస్తోంది.
also read:Chiranjeevi:కాకా.. విశ్వంభర.. చిరంజీవి ఫ్యాన్స్ లో అయోమయం..!
2000 దశకం నాటి నేపథ్యం:
ట్రైలర్లో కనిపించే ‘వర్షం’, ‘వెంకీ’, ‘ఆంధ్రావాలా’, ‘పెదబాబు’ వంటి అప్పటి సినిమాల పోస్టర్లు కథ 2000వ దశకం నేపథ్యంలో సాగుతుందని సూచిస్తున్నాయి. కళ్లద్దాలు, అమాయకమైన రూపంతో నితిన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. నాని సమర్పణలో వస్తున్న ఈ సినిమా కంటెంట్ పరంగా కూడా కొత్త అనుభూతిని అందించేలా కనిపిస్తోంది. మరి రొమాంటిక్ కామెడీతో పాటు ఎమోషన్స్‌ను మేళవించిన ‘అలియాస్ రుక్మిణి’ డిసెంబర్ 4న ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.




