Satya Krishnan : తెలుగు సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి సత్య కృష్ణన్. ముఖ్యంగా ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేవారు. అయితే కొంతకాలంగా వెండితెరపై ఆమె కనిపించడం తగ్గింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య కృష్ణన్.. తన సినీ ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
also read: Varanasi:సరికొత్త రికార్డు సృష్టించిన వారణాసి సినిమా..!
అదే ఇమేజ్ అడ్డంకిగా మారింది :
సత్య కృష్ణన్ ఎక్కువగా అక్క, వదిన, తల్లి, సంసార పక్షమైన మహిళ వంటి పాత్రల్లో కనిపించారు. ఈ తరహా పాత్రలతో తనకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ.. అదే ఇమేజ్ తర్వాతి రోజుల్లో తనకు అవకాశాలను పరిమితం చేసిందని ఆమె తెలిపారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన లుక్ ఉండటంతో, దాన్ని మార్చి కొత్తగా చూపించేందుకు దర్శకులు పెద్దగా రిస్క్ తీసుకోరని చెప్పారు. ఒకసారి ఓ ఇమేజ్ ఏర్పడితే నటులను అదే తరహా పాత్రలకు పరిమితం చేసే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. పాత్రకు తగిన విధంగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేకపోతే.. ఎలాంటి పాత్రనైనా చేయడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.
అనుకోకుండా సినిమాల్లోకి..:
సత్య కృష్ణన్(Satya Krishnan) సినీ ప్రయాణం కూడా అనూహ్యంగానే ప్రారంభమైంది. హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. తాజ్ గ్రూప్‌లో ఫ్రంట్ ఆఫీస్ విభాగంలో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల సహ-నిర్మాత సునీత తాటి ఆమెను గుర్తించి ‘డాలర్ డ్రీమ్స్’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అప్పటివరకు ఆడిషన్ అంటే ఏమిటో కూడా తనకు తెలియదని, ఉద్యోగం చేస్తూనే ఆ సినిమాలో నటించానని ఆమె గుర్తుచేసుకున్నారు. సినిమాలు తన కెరీర్‌గా మారతాయని అప్పుడు అసలు ఊహించలేదన్నారు.
also read: Vishnu Priya:స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఒలకబోస్తున్న విష్ణు ప్రియ..!
‘ఆనంద్’, ‘బొమ్మరిల్లు’తో గుర్తింపు :
‘ఆనంద్’ సినిమాతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని సత్య కృష్ణన్ తెలిపారు. అనంతరం వివాహం, బిడ్డ పుట్టడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ నటనను కొనసాగించారు. ఈ క్రమంలో ‘బొమ్మరిల్లు’ వంటి విజయవంతమైన చిత్రంలో భాగం కావడం తన కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిందని చెప్పారు.
also read:Varanasi:సరికొత్త రికార్డు సృష్టించిన వారణాసి సినిమా..!
24 ఏళ్లుగా కొనసాగుతున్న దాంపత్యం :
సత్య కృష్ణన్ కుటుంబానికి సినీ నేపథ్యం లేదు. ఆమె తల్లిదండ్రులు ఎస్‌బీఐలో ఉద్యోగాలు చేయగా, గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉద్యోగులేనని తెలిపారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తాను తెలంగాణ బిడ్డనని సగర్వంగా చెప్పారు. ఇక సత్య కృష్ణన్‌ది ప్రేమ వివాహం. ఆమె భర్త తమిళుడు కావడంతో తొలినాళ్లలో అత్తమామలు కొంత ఇబ్బంది పడ్డారని తెలిపారు. అయితే భర్త బంధువులు నచ్చజెప్పడంతో వివాహం జరిగిందన్నారు. తమ 24 ఏళ్ల దాంపత్యంలో చిన్న చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు సహజమేనని.. అయినప్పటికీ ప్రేమ వివాహానికి ఉండే ప్రత్యేకమైన అనుబంధం తమ మధ్య ఉందని సత్య కృష్ణన్ చెప్పారు. తాను ఎంత మొండిగా ఉన్నా చివరికి తన భర్తే తగ్గుతారని సరదాగా వెల్లడించారు.




