Vijay Deverakonda:ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే కొందరికి మాత్రం ఫోన్ కేవలం అవసరం మాత్రమే కాకుండా స్టేటస్ సింబల్‌గా కూడా మారింది. ముఖ్యంగా కొత్త ఐఫోన్ మోడల్ మార్కెట్లోకి వచ్చిన ప్రతిసారీ దానిని కొనుగోలు చేసి సోషల్ మీడియాలో ప్రదర్శించాలనే ఆసక్తి చాలామంది యువతలో కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఈఎంఐలు, రుణాల ద్వారా ఖరీదైన ఫోన్లు కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కొత్త ఫోన్ ఎందుకు కొనాలి? :
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండకు(Vijay Deverakonda) ఆయన ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ గురించి ప్రశ్న ఎదురైంది. విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులు కొత్త మోడల్స్ అందుబాటులోకి వచ్చినా పాత ఐఫోన్లనే ఉపయోగిస్తున్నారని యాంకర్ ప్రస్తావించారు. మీరు కూడా మంచి ఆదాయం ఉన్న స్టార్ హీరోనే కదా.. మరి కొత్త ఫోన్ ఎందుకు కొనడం లేదని అడిగారు.
దీనికి విజయ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న ఫోన్ సరిగ్గా పనిచేస్తోందని, తనకు అవసరమైన పనులన్నీ దానితోనే పూర్తవుతున్నప్పుడు కేవలం కొత్త మోడల్ వచ్చిందనే కారణంతో మరో ఫోన్ కొనాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అవసరం ఉన్నప్పుడే కొత్త వస్తువు కొనుగోలు చేయాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
also read:Allu Arjun:అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా.. మళ్లీ తెరపైకి సంచలన కాంబినేషన్!
సెలబ్రిటీలను చూసి అనవసరంగా ఖర్చు చేయొద్దు :
సెలబ్రిటీలు ఉపయోగించే ప్రతి వస్తువును వారు సొంత డబ్బుతోనే కొనుగోలు చేస్తారని చాలామంది భావిస్తుంటారని విజయ్ పేర్కొన్నారు. అయితే బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖులకు కంపెనీలు ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఇతర ఖరీదైన వస్తువులను ఉచితంగా అందించే సందర్భాలు కూడా ఉంటాయని వివరించారు.
అందువల్ల సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌ను చూసి సామాన్యులు తమ ఆర్థిక పరిస్థితిని మరిచిపోయి ఖర్చులు చేయకూడదని సూచించారు. కేవలం కొద్దిరోజులు ఇతరుల ముందు గొప్పగా కనిపించేందుకు అప్పులు చేసి ఖరీదైన ఫోన్లు కొనడం సరైన నిర్ణయం కాదని హితవు పలికారు.
also read:Chiranjeevi:చిరంజీవి ‘కాకా’లో కీలక మార్పు.. విజయశాంతి స్థానంలో రమ్యకృష్ణ!
అవసరానికి ప్రాధాన్యత ఇవ్వాలి :
డబ్బును ఖర్చు చేసే విషయంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని విజయ్ సూచించారు. నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు చేయాలని, ఇతరులను ఆకట్టుకోవడం కోసం లగ్జరీ వస్తువులపై అనవసరమైన మోజు పెంచుకోవద్దని చెప్పారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన చెప్పిన మాటలు వాస్తవికంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా యువత అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలనే సందేశం అందరికీ ఉపయోగపడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.




