Maremma Movie Review:మాస్ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘మారెమ్మ’. ఈ సినిమాతో దీపా బాలు కథానాయికగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. మంచాల నాగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపాలక్ష్మి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా గ్రామదేవత, దున్నపోతు చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కింది. ‘మారెమ్మ’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? మాధవ్ భూపతిరాజు తొలి ప్రయత్నం ఎలా ఉంది? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ :
వరంగల్ ప్రాంతంలోని మహిషాపురం అనే గ్రామంలో అనూహ్యంగా గత్తర వ్యాధి వ్యాపిస్తుంది. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో గ్రామం అతలాకుతలమవుతుంది. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులకు మారెమ్మ అమ్మవారి విగ్రహం లభిస్తుంది. ఆమెను గ్రామదేవతగా భావించి పూజలు ప్రారంభిస్తారు. అమ్మవారికి దున్నపోతును బలి ఇచ్చిన తర్వాత గ్రామంలో పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. వ్యాధి తగ్గిపోవడంతోపాటు వరదలు కూడా తగ్గుతాయి. దీంతో మారెమ్మ తమ గ్రామాన్ని కాపాడే దేవతగా ప్రజలు విశ్వసిస్తారు.
అయితే ఓ ఒంటికన్ను పూజారి భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందుగానే చెబుతాడు. గ్రామంలో పుట్టబోయే దున్నపోతును పదేళ్లపాటు జాగ్రత్తగా పెంచి, ఆ తర్వాత అమ్మవారికి బలి ఇవ్వాలని సూచిస్తాడు. ఆ బాధ్యత కర్ణి (మాధవ్ భూపతిరాజు)కి అప్పగిస్తారు. దున్నపోతుకు కూడా మారెమ్మ అనే పేరు పెడతారు.
గ్రామంలో ఎవరైనా తప్పు చేసినా, చెడుగా ప్రవర్తించినా మారెమ్మ ఆగ్రహానికి గురవుతారు. ఈ క్రమంలో జలేంధర్ (వికాస్ వశిష్ట) మారెమ్మపై పగ పెంచుకుంటాడు. దాన్ని అంతం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరోవైపు గ్రామ జాతరకు సమయం దగ్గరపడుతుంది. మారెమ్మను అమ్మవారికి బలి ఇవ్వాల్సిన తరుణంలో అది అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది.
మారెమ్మ ఎక్కడికి వెళ్లింది? దాని అదృశ్యం వెనుక ఉన్నది ఎవరు? కర్ణి తన ప్రాణంగా భావించే దున్నపోతును తిరిగి ఎలా తీసుకొచ్చాడు? గ్రామంలో చోటుచేసుకున్న వరుస పరిణామాలకు అసలు కారణమేంటి? అన్నదే మిగతా కథ.
also read:Anchor Bhanu sri:వారిని నమ్మి 20 లక్షలు మోసపోయిన యాంకర్..!
విశ్లేషణ :
గ్రామదేవత, తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకోవడం ‘మారెమ్మ’కు(Maremma Movie Review) ఆసక్తికరమైన పాయింట్. ప్రారంభంలో గ్రామంలో గత్తర రావడం, వరదలు, అమ్మవారి విగ్రహం లభించడం, దున్నపోతును బలి ఇవ్వడం వంటి అంశాలతో కథపై ఆసక్తి పెంచారు. ముఖ్యంగా దున్నపోతు పుట్టే వరకు కథనం కొంత ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఆ తర్వాత సినిమా నెమ్మదిస్తుంది. దున్నపోతు చుట్టూ జరిగే సంఘటనలతోపాటు హీరో ప్రేమకథను కూడా ప్రధాన కథలోకి తీసుకొచ్చారు. కానీ ఈ లవ్ ట్రాక్ కథకు సహజంగా అనిపించదు. బలవంతంగా జోడించినట్టుగా కనిపిస్తుంది.
మారెమ్మపై విలన్ కుట్ర మొదలైన తర్వాత కథ కొంత సీరియస్‌గా మారుతుంది. దున్నపోతు తనను ఇబ్బంది పెట్టేవారిపై దాడి చేసే సన్నివేశాలు కొంత ఆసక్తిని కలిగిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ట్విస్టులతో ఆకట్టుకునేలా ఉంది.
అయితే ద్వితీయార్ధంలో కథనం మరింత బలహీనపడుతుంది. మారెమ్మ కోసం వెతకడం చుట్టూనే ఎక్కువ భాగం సాగుతుంది. మధ్యలో అమ్మవారి మహిమలు, మాంత్రికురాలి ఎపిసోడ్లు వచ్చినప్పటికీ అవి కథను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. మారెమ్మ ఎక్కడ ఉందనే సస్పెన్స్ కొంత వరకు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించినా, దానికి సరైన స్థాయిలో పరిష్కారం ఇవ్వలేకపోయారు.
హీరో పాత్ర కంటే దున్నపోతు పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. దీంతో మాధవ్ పాత్ర సెకండ్ లీడ్‌లా కనిపిస్తుంది. ప్రేమకథ, కామెడీ, ఎమోషన్ వంటి అంశాలు కూడా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. తెలంగాణ యాస విషయంలోనూ సహజత్వం లోపించింది.
క్లైమాక్స్ వద్ద కొంత ఆసక్తి పెరిగినా, చివరికి సాధారణ ముగింపుతో సినిమాను ముగించారు. మొత్తంగా మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నప్పటికీ, దాన్ని ప్రభావవంతంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.
also read:Sardar 2 Movie Review:సర్దార్ 2 మూవీ రివ్యూ: కార్తీ స్పై యాక్షన్ ఎలా ఉంది?
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
మాధవ్ భూపతిరాజు: కర్ణి పాత్రలో మాధవ్ భూపతిరాజు కొంత వరకు ఆకట్టుకున్నాడు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అయితే నటనలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌లో తడబాటు కనిపిస్తుంది. తొలి సినిమాగా కొన్ని విషయాల్లో ఫర్వాలేదనిపించినా, నటుడిగా మరింత సాధన అవసరం.
దీపా బాలు: హీరోయిన్గా దీపా బాలు ఫ్రెష్‌గా కనిపించింది. తన పాత్ర పరిధిలో బాగానే నటించింది. స్క్రీన్‌పై అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.
వికాస్ వశిష్ట: ప్రతినాయకుడి పాత్రలో వికాస్ వశిష్ట మెప్పించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు సరిపోయాడు.
వినోద్ కుమార్: గ్రామ పెద్ద పాత్రలో తన అనుభవాన్ని చూపించారు. పాత్రకు తగ్గట్టుగా నటించారు.
టెక్నికల్ టీమ్ :
ప్రశాంత్ విహారి అందించిన సంగీతం సినిమాకు పెద్దగా బలంగా నిలవలేదు. కొన్ని సందర్భాల్లో ఫర్వాలేదనిపించినా, ఎక్కువ భాగం సాధారణంగానే ఉంది. ప్రశాంత్ అంకిరెడ్డి కెమెరా పనితనం ఓకే. ముఖ్యంగా పాతకాలం నాటి గ్రామీణ వాతావరణాన్ని తెరపై చూపించే ప్రయత్నం బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా సినిమాకు అనుకూలంగా ఉంది.
ఎడిటింగ్ మాత్రం ప్రధాన బలహీనతల్లో ఒకటి. సన్నివేశాల మధ్య సరైన కనెక్షన్ లేకపోవడంతో సినిమా ఫ్లో దెబ్బతింది. కథకు సంబంధం లేని సన్నివేశాలు, అనవసరమైన ట్రాక్‌లు నిడివిని పెంచాయి.
దర్శకుడు మంచాల నాగరాజు ఎంచుకున్న పాయింట్ ఆసక్తికరంగానే ఉంది. కానీ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, కథనంలో పట్టు కనిపించలేదు. ముఖ్యంగా కథలోని ఎమోషన్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో విఫలమయ్యారు. లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, ఇతర పాత్రల సన్నివేశాలు ప్రధాన కథకు ఆటంకంగా మారాయి.
నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో రాజీ పడిన భావన కలుగుతుంది.
ప్లస్‌లు :
*తెలంగాణ గ్రామీణ నేపథ్యం
*మారెమ్మ గ్రామదేవత కాన్సెప్ట్
*ప్రారంభంలోని బ్యాక్‌స్టోరీ
*ఇంటర్వెల్ ట్విస్టులు
*దున్నపోతు చుట్టూ తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు
*ఆర్ట్ వర్క్
మైనస్‌లు :
*బలహీనమైన స్క్రీన్‌ప్లే
*నెమ్మదిగా సాగే కథనం
*సన్నివేశాల మధ్య సరైన కనెక్షన్ లేకపోవడం
*బలవంతంగా అనిపించే లవ్ ట్రాక్
*కామెడీ, ఎమోషన్ వర్కౌట్ కాకపోవడం
*తెలంగాణ యాసలో సహజత్వం లేకపోవడం
*లాజిక్కు దూరంగా అనిపించే కొన్ని సన్నివేశాలు
*ఎడిటింగ్
*ప్రభావం చూపని క్లైమాక్స్
పంచ్‌లైన్ :‘మారెమ్మ’ మంచి కాన్సెప్ట్.. బలహీనమైన ఎగ్జిక్యూషన్!




