Tammareddy:టాలీవుడ్‌లో ఒకప్పుడు లవర్ బాయ్‌గా అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉదయ్ కిరణ్. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. అయితే కెరీర్‌లో కొంతకాలం పాటు వరుస విజయాలు అందుకున్న ఆయన.. ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనుకబడిపోయారు. అవకాశాలు తగ్గడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. చివరకు 2014లో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఉదయ్ కిరణ్ కెరీర్ పతనానికి చిరంజీవి కారణమనే ప్రచారం అప్పటినుంచి కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ అంశంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
చిరంజీవి అవకాశాలు అడ్డుకున్నారనేది నిజమేనా? :
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజ.. ఉదయ్ కిరణ్ కెరీర్ దెబ్బతినడానికి చిరంజీవి కారణమనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సుస్మితతో నిశ్చితార్థం రద్దయిన తర్వాత తనకు సినిమా అవకాశాలు రావడం లేదని ఉదయ్ కిరణ్ తన దగ్గర బాధపడినట్లు గుర్తుచేసుకున్నారు. అయితే పెళ్లి విషయంలో కూడా ఉదయ్ కిరణ్ తనకు నచ్చకపోవడంతోనే సంబంధాన్ని ఆపుకున్నట్లు చెప్పారని తమ్మారెడ్డి వెల్లడించారు.
ఉదయ్ కిరణ్‌కు సినిమా అవకాశం ఇచ్చినా..:
ఉదయ్ కిరణ్ తన దగ్గరకు వచ్చిన సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారట. దీంతో ‘పోతే పోనీ’ సినిమాలో అవకాశం ఇస్తానని, చిరంజీవి అడ్డుకుంటున్నారని అనుకుంటే తన సినిమా ద్వారా ఆ విషయం తెలుస్తుందని భరోసా ఇచ్చారట. అయితే ఆ సినిమా కథ మార్చాలని ఉదయ్ కిరణ్ కోరినట్లు తమ్మారెడ్డి తెలిపారు. అప్పటికే సిద్ధమైన కథను తన కోసం ఎందుకు మార్చాలని, అవకాశం ఇస్తున్నప్పుడు అందులో నటించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.
also read:Ananya nagalla: దీపావళి పండుగ వేళ మరింత సాంప్రదాయంగా ఆకట్టుకున్న తెలుగమ్మాయి!
పెద్ద దర్శకులు, నిర్మాతల కోసం ఎదురుచూశారు:
కెరీర్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాల్సింది పోయి, పెద్ద దర్శకులు, నిర్మాతలతోనే సినిమాలు చేయాలని ఉదయ్ కిరణ్(Tammareddy) భావించారని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. రాజమౌళి వంటి దర్శకుడు, కేఎల్ నారాయణ వంటి నిర్మాతతో సినిమా చేయాలనే ఆలోచన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అప్పటికే మార్కెట్ తగ్గిన పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు రావడం కష్టమని వివరించారు.
also read:Janhvi Kapoor:సర్జరీతో మారిన అమ్మ అభిప్రాయం.. జాన్వీ ఆసక్తికర విషయాలు!
చిరంజీవి అడ్డుపడలేదనడానికి ఇదే ఉదాహరణ:
ఆ తర్వాత ల్యాంకో శ్రీధర్ నిర్మాణంలో ‘వియ్యాలవారి కయ్యాలు’ సినిమాలో ఉదయ్ కిరణ్ నటించారని తమ్మారెడ్డి గుర్తుచేశారు. నిజంగానే చిరంజీవి అడ్డుపడితే ఆ సినిమా కూడా పట్టాలెక్కేది కాదని అభిప్రాయపడ్డారు. అందుకే చిరంజీవి అవకాశాలను అడ్డుకున్నారనే ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఏదేమైనా, సరైన సమయంలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఉంటే ఉదయ్ కిరణ్ మళ్లీ విజయాల బాట పట్టేవారేమోనని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతిభ ఉన్న నటుడిని తెలుగు ప్రేక్షకులు కోల్పోవడం బాధాకరమని చెప్పొచ్చు.




