Anushka Sharma:ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న చోలే భటూరే రెస్టారెంట్ పేరు ‘ఢిల్లీ సే’. ఇద్దరు సోదరులు జస్పాల్ సింగ్ ఖాల్సా, మహీందర్ సింగ్ ఖాల్సా 2021 అక్టోబర్‌లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కేవలం 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు టేబుళ్లు, తొమ్మిది సీట్లతో మొదలైన ఈ వ్యాపారం ప్రారంభంలో బాగానే సాగింది. అయితే 2022 జనవరి నుంచి కస్టమర్ల సంఖ్య తగ్గడంతో పరిస్థితి క్రమంగా క్లిష్టంగా మారింది. దాదాపు రూ.18 లక్షల అప్పులు పేరుకుపోవడంతో రెస్టారెంట్‌ను మూసివేయాలని సోదరులు ఆలోచించారు.
ఒక్క సంఘటనతో మారిన పరిస్థితి:
అదే సమయంలో 2022 సెప్టెంబర్‌లో వారి జీవితాన్ని మార్చే పరిణామం చోటుచేసుకుంది. స్టాండప్ కమెడియన్ అభిషేక్ ఉపమన్యు ‘ఢిల్లీ సే’కి వచ్చి చోలే భటూరే తిన్నారు. ఆయన ఎవరో అప్పట్లో సోదరులకు తెలియదు. అయితే మరుసటి రోజు నుంచే రెస్టారెంట్‌కు కస్టమర్లు పెరగడం మొదలైంది. ఆ తర్వాత అభిషేక్ ఉపమన్యు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ఢిల్లీ సే’ గురించి ప్రస్తావించినట్లు వారికి తెలిసింది.
అనుష్క శర్మకు నచ్చిన చోలే భటూరే :
ఆ తర్వాత ఈ రెస్టారెంట్ గురించి నటి అనుష్క శర్మకు(Anushka Sharma) కూడా తెలిసింది. ఆమె భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీకి చోలే భటూరే అంటే చాలా ఇష్టం. ముంబైలో ఢిల్లీ రుచిని గుర్తు చేసే చోలే భటూరే కోసం అనుష్క వెతుకుతున్న సమయంలో ‘ఢిల్లీ సే’ గురించి తెలుసుకున్నారు.
ఒకరోజు విరాట్ కోహ్లీ ఇంటి నుంచి రెస్టారెంట్‌కు ఫోన్ వచ్చింది. రెండు ప్లేట్ల చోలే భటూరేను జుహూకు పంపాలని కోరారు. రెండు ప్లేట్ల ధర అప్పట్లో కేవలం రూ.120 మాత్రమే కావడంతో జస్పాల్‌కు ఇది నిజమైన ఆర్డర్ అనిపించలేదు. ఎవరో ఆటపట్టిస్తున్నారని భావించారు. అయినప్పటికీ చివరకు ఆర్డర్ తీసుకుని జుహూకు వెళ్లి డెలివరీ చేశారు.
ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. ‘ముంబైలో చివరకు ఢిల్లీ రుచిలో చోలే భటూరే దొరికాయి’ అంటూ ఈ రెస్టారెంట్ గురించి అభిషేక్ ఉపమన్యు ద్వారా తెలుసుకున్నట్లు కూడా పేర్కొన్నారు.
ALSO READ:Chiranjeevi:చిరంజీవిని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఈమె..!
కోట్ల వ్యాపారంగా మారిన చిన్న షాప్ :
అనుష్క పోస్ట్ వైరల్ కావడంతో ‘ఢిల్లీ సే’ వద్దకు భారీగా కస్టమర్లు చేరుకున్నారు. ఫోన్లు నిరంతరం మోగడంతో పాటు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడం మొదలైంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో రెస్టారెంట్ వద్ద జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు కూడా రావాల్సి వచ్చింది.
మొదట రోజుకు ఎనిమిది కిలోల చోలే మాత్రమే తయారు చేసేవారు. కానీ కేవలం మూడు రోజుల్లోనే ఆ పరిమాణం 100 కిలోలకు చేరింది. సరుకు కొరత ఏర్పడటంతో చుట్టుపక్కల ఇళ్లవారి సహాయం కూడా తీసుకున్నారు. కొంతమంది కస్టమర్లు రెండు, మూడు ప్లేట్ల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
ALSO READ:Prabhas:ప్రభాస్ రొమాంటిక్ పోస్ట్.. జూలియట్ ఎక్కడ అంటూ షాక్ ఇచ్చిన డార్లింగ్!
నెలకు రూ.2 కోట్ల అమ్మకాలు :
ఒకప్పుడు నెలకు రూ.1 నుంచి 1.5 లక్షల వరకు మాత్రమే అమ్మకాలు జరిగే ‘ఢిల్లీ సే’ ప్రస్తుతం నెలకు సుమారు రూ.2 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నట్లు సోదరులు చెబుతున్నారు. ప్రస్తుతం చెంబూర్, ములుంద్, అంధేరీ వెస్ట్, వాషీ ప్రాంతాల్లో నాలుగు ఔట్‌లెట్లు ఉన్నాయి. రోజుకు 3,000కు పైగా చోలే భటూరే ప్లేట్లు విక్రయిస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఒకప్పుడు రూ.18 లక్షల అప్పులతో వ్యాపారం మూసివేయాలని భావించిన ఇద్దరు సోదరులు.. ఇప్పుడు అదే చోలే భటూరేతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అభిషేక్ ఉపమన్యు పరిచయం చేసిన ఈ చిన్న రెస్టారెంట్‌కు అనుష్క శర్మ చేసిన ఒక్క సోషల్ మీడియా పోస్ట్ భారీ గుర్తింపును తీసుకొచ్చింది.




