Samantha:వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వ్యాపార రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నటిగా ఎన్నో విజయాలు అందుకున్న ఆమె.. వ్యాపారవేత్తగా కూడా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వ్యాపార ప్రయాణం మొదట్లోనే ఆమెకు అనుకోని ఎదురుదెబ్బ తగిలిందట. తొలి పెట్టుబడిలో నష్టాలు రావడంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని సమంత వెల్లడించారు. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె తన వ్యాపార అనుభవాలు, పెట్టుబడులు, మహిళా పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మొదట నుండి సమంత ని చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు మహిళలు. ఇప్పుడు ఆమె చెప్పిన బిజినెస్ టిప్స్ కూడా అంతే చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు.
మొదటి వ్యాపారంలోనే నష్టాలు :
సినిమా రంగంలో స్టార్‌డమ్ సంపాదించిన సెలబ్రిటీలకు వ్యాపారాలు ప్రారంభించడం సులభమని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతి వ్యాపార ప్రయాణం విజయాలతోనే మొదలవ్వదని సమంత అనుభవం చెబుతోంది. తన తొలి వ్యాపార ప్రయత్నం ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదని ఆమె తెలిపారు. మొదటి వెంచర్‌లో భాగస్వామ్యంగా పెట్టిన పెట్టుబడి నష్టాలను మిగిల్చిందని వెల్లడించారు.
అయితే ఆ నష్టాన్ని తాను పెద్ద వైఫల్యంగా భావించలేదని సమంత పేర్కొన్నారు. వ్యాపారంలో ఎదురయ్యే ఒడిదుడుకులు ఎన్నో విషయాలను నేర్పిస్తాయని, అపజయాలు మనలోని లోపాలను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
ALSO READ:kiyara advani:బోల్డ్ సీన్స్ పై ట్రోల్ .. కియారా షాకింగ్ కామెంట్స్!
ఏకంగా 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు :
మొదటి వ్యాపారంలో నష్టాలు ఎదురైనా సమంత(Samantha) మాత్రం వెనక్కి తగ్గలేదు. కొత్త ఆలోచనలు, వినూత్న వ్యాపార అవకాశాలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం దాదాపు పది స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆమె వెల్లడించారు. ఈ పెట్టుబడుల వెనుక కేవలం లాభాలే లక్ష్యం కాదని, కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలనే ఉద్దేశం కూడా ఉందని తెలుస్తోంది.కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సరైన ప్రోత్సాహం అందించడం తనకు ఆనందాన్ని ఇస్తుందని సమంత తెలిపారు.
ALSO READ:Srinidhi Shetty: అందాల సోయగాలతో మైమరపిస్తున్న శ్రీనిధి శెట్టి!
మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా..:
సమంత పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఆమె మద్దతు ఇస్తున్న దాదాపు ఎనిమిది స్టార్టప్‌లకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారట. మహిళా పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని ఆమె చెప్పారు.
మహిళలకు సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే వ్యాపార రంగంలో అద్భుతాలు సృష్టించగలరని సమంత అభిప్రాయపడ్డారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మహిళలు రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదని సూచించారు. వైఫల్యాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేయాలని తెలిపారు.
మొత్తానికి, తొలి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్న సమంత.. వాటినే అనుభవాలుగా మార్చుకుంటూ పెట్టుబడిదారుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళా స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం ద్వారా వ్యాపార రంగంలోనూ తనదైన గుర్తింపు సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.




