Agadha:శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో తెరకెక్కిన హారర్ మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’. ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విడుదలకు ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి థియేటర్లలోకి వచ్చిన ‘అగధ’ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
దైవభక్తి ఎక్కువగా ఉండే మహాదేవి (కామాక్షి భాస్కర్ల) తన వద్దకు వచ్చే వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది. అయితే సొంత ఊరిలో అనుకోని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆమె అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ గర్భవతిగా ఉన్న మహిమ (ఉల్కా గుప్తా) అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం మహాదేవిని కలవరపెడుతుంది. ఆ ఇంట్లో ఏదో అశుభం జరుగుతోందని ఆమె గుర్తిస్తుంది. అదే సమయంలో ఆమె బాబాయ్, పిన్ని, వారి కుమార్తె ప్రవర్తనలోనూ అనూహ్యమైన మార్పులు కనిపిస్తాయి. మరోవైపు మరణించిన మహిమకు సంబంధించిన సింహా (శ్రవణ్ రెడ్డి) వ్యవహారశైలి కూడా అనుమానాలను రేకెత్తిస్తుంది.
అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? మహిమ ఆత్మ మహాదేవికి ఏం చెప్పాలనుకుంటోంది? ఈ మరణాల వెనుక ఉన్న ‘అగధ’(Agadha) అనే దుష్టశక్తి ఏమిటి? దాన్ని ఎదుర్కొనేందుకు మహాదేవి గురువు చేసిన త్యాగం ఏమిటి? చివరకు మహాదేవి ఆ శక్తిని ఎలా ఎదుర్కొంది? అన్నదే సినిమా ప్రధాన కథ.
also read:Surya:సూర్య-మమితా బైజు విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ..!
కథనం:
దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటం అనే కాన్సెప్ట్ హారర్ సినిమాలకు ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. దర్శకుడు ఎం.ఎస్. రాజు ఈ కథను మిస్టరీ, హారర్ అంశాలతో నడిపించే ప్రయత్నం చేశారు. ఆయన గతంలో తెరకెక్కించిన ‘దేవి’ సినిమా ఛాయలు కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తాయి.
మొదటి భాగం మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగించేలా సాగుతుంది. ప్రారంభ సన్నివేశాలు, గుహ నేపథ్యంలో వచ్చే సీన్లు, మహాదేవి పాత్ర పరిచయం, ఆమెకు ఉన్న శక్తులను చూపించే విధానం ఆకట్టుకుంటాయి. అయితే అసలు బలహీనత ద్వితీయార్థంలో కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో రేకెత్తించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ఆత్మ ద్వారా చెప్పించే గత కథనం కొంత రొటీన్‌గా అనిపిస్తుంది.
దైవశక్తి, దుష్టశక్తి మధ్య పోరాటాన్ని దర్శకుడు ఒక స్థాయి వరకు ఆసక్తికరంగానే చూపించారు. అయితే హారర్ ఎలిమెంట్స్‌ను మరింత బలంగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా పెద్దగా వెళ్లలేదు. క్లైమాక్స్ కూడా కొంత సాధారణంగా అనిపిస్తుంది. కథకు మరింత విస్తరణ ఉండొచ్చనే భావన కలుగుతుంది.
also read:Riddhi Kumar: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రభాస్ బ్యూటీ!
నటీనటులు :
మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల ఆకట్టుకున్నారు. పాత్ర కోసం ఆమె చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. సీరియస్ లుక్‌లో బాగా కనిపించినప్పటికీ, సినిమా మొత్తం ఒకే తరహా హావభావాలు కొనసాగించడం కొంత మైనస్‌గా మారింది. శ్రవణ్ రెడ్డి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో మెప్పించారు. జోవికా విజయ్ కుమార్‌కు లభించిన పరిమిత సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఉల్కా గుప్తా తన పాత్రకు న్యాయం చేసింది.
టెక్నికల్ టీమ్:
‘అగధ’కు ప్రధాన బలం సాంకేతిక విభాగమే. నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగుతూ కొన్ని సన్నివేశాలకు మంచి ఇంపాక్ట్‌ను తీసుకొచ్చింది. కెమెరా పనితనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హారర్, మిస్టిక్ వాతావరణాన్ని తెరపై చూపించడంలో విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఆర్ట్ డైరెక్షన్ కూడా సినిమా ప్రపంచానికి తగ్గట్టుగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రొడక్షన్ డిజైన్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
*ఆసక్తికరమైన హారర్ కాన్సెప్ట్
*ఫస్ట్ హాఫ్‌లో మంచి ఉత్కంఠ
*కామాక్షి భాస్కర్ల నటన
*నేపథ్య సంగీతం
*కెమెరా వర్క్, విజువల్స్
*ఆర్ట్ డైరెక్షన్
*నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
*ద్వితీయార్థం నెమ్మదించడం
*కొన్ని సన్నివేశాల్లో రొటీన్ ట్రీట్మెంట్
*ఆశించిన స్థాయిలో భయాన్ని పుట్టించలేకపోవడం
*కొన్ని పాత్రలకు తక్కువ ప్రాధాన్యం
*క్లైమాక్స్ మరింత బలంగా ఉండాల్సింది
పంచ్ లైన్:
కొంత థ్రిల్.. మరికొంత మిస్టరీ.. కానీ పూర్తిస్థాయి హారర్ అనుభూతిని ఇవ్వడంలో ‘అగధ’ కొంత వెనుకబడింది.




