Om Chapter 1:కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ మూవీ ‘ఓం: చాప్టర్-1’. (Om Chapter 1)రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ, అనూహ్యంగా అర్ధరాత్రి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ :
ట్రైలర్‌ను పరిశీలిస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కార్తికేయన్ అనే అంతర్జాతీయ స్మగ్లర్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తున్నారు. అతని అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడానికి టాస్క్‌ఫోర్స్ పోలీస్ అధికారి ధనుష్ రంగంలోకి దిగుతారు. మారువేషంలో స్మగ్లర్ల ముఠాలో చేరి వారి కార్యకలాపాలపై నిఘా పెడతారు.
అయితే ఆ గ్యాంగ్‌లోకి వెళ్లిన తర్వాత ధనుష్ పాత్రలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నట్లు ట్రైలర్లో చూపించారు. స్మగ్లర్లకు అండగా నిలుస్తూ పోలీసులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమవుతారు. అసలు ఆయన అలా ఎందుకు మారారు? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? అన్న ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి.
ఐపీఎస్ అధికారిగా సాయి పల్లవి :
ఈ సినిమాలో సాయి పల్లవి నిత్యారెడ్డి అనే ఐపీఎస్ అధికారిణి పాత్రలో కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటకు చెందిన అధికారిణిగా ఆమె పాత్రను పరిచయం చేశారు. అడవుల్లో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రత్యేక విధులపై ఆమె నియమితులైనట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. మరోవైపు ధనుష్ భార్య రోజా పాత్రలో శ్రీలీల నటిస్తున్నారు.
‘ఆపరేషన్ మోల్’ (ద్రోహి) పేరుతో ప్రత్యేక మిషన్‌ను ప్రారంభించినట్లు ట్రైలర్లో చూపించారు. ధనుష్ నిజంగానే పోలీసు శాఖకు ద్రోహం చేశారా? లేక ఆయన వెనుక మరో వ్యూహం ఉందా? మమ్ముట్టి పాత్రకు సంబంధించిన గతం ఏమిటి? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
also read:Sai Pallavi:ఓం సినిమాలో సాయి పల్లవి పాత్ర వెనుక ఇంత కథ ఉందా..?
ట్రైలర్లో ఆకట్టుకున్న రేణూ దేశాయ్ :
కథను పూర్తిగా వెల్లడించకుండా ఆసక్తికరమైన సన్నివేశాలతో ట్రైలర్‌ను రూపొందించారు. ధనుష్, మమ్ముట్టి మధ్య సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్, నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత నటి రేణూ దేశాయ్ తెరపై కనిపించడం ప్రేక్షకులకు సర్ప్రైజ్గా మారింది. నజీరుద్దీన్ షా, ఇంద్రన్స్, సంజయ్ స్వరూప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
also read:Telugu Movies:ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 20 సినిమాలు ఇవే..!
నవంబర్ 20న పాన్ ఇండియా విడుదల :
వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, కె. ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ, ఆర్. కలైవానన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా ధనుష్ పాత్రలో వచ్చే ట్విస్టులు, మమ్ముట్టి నటన వెండితెరపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి…?




