OTT:కోలీవుడ్ నటుడు అథర్వ, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హృదయం మురళి’ త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జులై 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ, ఇప్పుడు డిజిటల్ విడుదలతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఎస్. థమన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నటుడిగా కనిపించడం ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచింది.
ఆగస్ట్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన ఈ మూవీ, ఓటీటీలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించారు. అథర్వ, ప్రీతి ముకుందన్‌తో పాటు కయాదు లోహర్, మాళవిక మోహనన్, నిహారిక ఎన్‌ఎం, ఫహాద్ ఫాజిల్, ఎస్. థమన్, రాంకీ, సుధాకర్, నట్టి సుబ్రహ్మణ్యం, జోనితా గాంధీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.
also read:Tollywood:సీక్రెట్‌గా ఉంగరాలు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ!
సినిమా కథ ఏంటి?
‘హృదయం మురళి’ కథ హృదయ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతడిని మామయ్య ప్రేమగా పెంచుతాడు. జీవితంలోని ప్రతి దశలో అతనికి ప్రేమ పరిచయమైనా, తన భావాలను ఎప్పుడూ బయటపెట్టలేక మనసులోనే దాచుకుంటూ ఉంటాడు. చిన్ననాటి టీచర్‌పై మొదలైన ఆకర్షణ నుంచి ట్యూషన్ స్నేహితురాలు సమంత, కాలేజీ రోజుల్లో అముద వరకు అతని జీవితంలో ఎన్నో ప్రేమ కథలు చోటు చేసుకుంటాయి. అదితితో పెళ్లికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, తన గతంలో చెప్పలేకపోయిన ప్రేమ భావాలను వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో హృదయ తన స్నేహితులతో కలిసి న్యూయార్క్‌కు బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో అతను ఎలాంటి నిజాలను తెలుసుకున్నాడు? చివరకు నిజమైన ప్రేమను గుర్తించాడా? సమంత, అముద, అదితిల్లో ఎవరు అతని జీవిత భాగస్వామిగా మారారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ‘హృదయం మురళి’ చిత్రాన్ని చూడాల్సిందే.
also read:Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ లెనిన్ మూవీ.. ఎప్పుడంటే?




