Saha Movie Review:శివకుమార్ కాసారం, శ్వేత లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సహ: లైఫ్ ఆఫ్ సంజు’. నిశాంత్ దోటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుమైరా స్టూడియోస్ పతాకంపై తేజ వెల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కొండా రెడ్డి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై హీరోహీరోయిన్లు చేసిన ఛాలెంజ్‌లు ఆసక్తిని పెంచాయి. మరి సినిమా వారి సవాల్‌కు తగ్గట్టుగా ఉందా? చూద్దాం.
కథ :
సంజీవ్ కుమార్ అలియాస్ సంజుకి చిన్నప్పటి నుంచే సహస్ర అంటే ఇష్టం. ఇద్దరూ కలిసి చదువుకుంటుండటంతో ఆమెను ఇంప్రెస్ చేయడానికి సంజు ప్రయత్నిస్తుంటాడు. ఓ సందర్భంలో సహస్రకు ముందుగా ప్రపోజ్ చేసే అవకాశం సంజుకి రావడంతో అతను ఊహించని విధంగా ఆమెకు ముద్దు పెడతాడు. మొదట ఆమె అతడిని తిరస్కరించినా.. క్రమంగా సంజు ప్రేమను అర్థం చేసుకుంటుంది.
ఆమె కోసం ఎంసెట్‌ను కూడా వదులుకున్న సంజు.. బీటెక్ చదవలేకపోయినా నకిలీ ఐడీ కార్డుతో కాలేజీకి వెళ్తుంటాడు. చివరకు వీరి ప్రేమ బయటపడటంతో పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. సహస్ర గర్భవతి కావడంతో ఆమె తండ్రి కూతురిని ఇంటికి తీసుకెళ్తాడు. ఇదే సమయంలో సంజు ఉద్యోగం కోల్పోవడంతో అసలు సమస్యలు మొదలవుతాయి. అత్తారింట్లో అవమానాలు ఎదుర్కొంటూ కుటుంబాన్ని నిలబెట్టేందుకు సంజు చేసే పోరాటమే మిగతా కథ.
ALSO READ:Bethlehem Kudumba Unit:‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
విశ్లేషణ:
‘సహ’లో(Saha Movie Review) టీనేజ్ ప్రేమ నుంచి పెళ్లి, ఆ తర్వాత బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల వరకు ఒక యువకుడి జీవితాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కథలో కొత్తదనం పెద్దగా కనిపించకపోయినా.. స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది.
ప్రారంభంలో ప్రేమకథ సాధారణంగానే సాగుతుంది. హీరోయిన్ను ఇంప్రెస్ చేయడానికి హీరో పడే తాపత్రయం, టాస్ ద్వారా ప్రపోజల్ ఛాన్స్ నిర్ణయించడం వంటి సన్నివేశాలు బాగున్నాయి. అయితే సినిమా ముందుకు వెళ్లే కొద్దీ చాలా సన్నివేశాలు ఊహించే విధంగానే సాగుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఏ దిశగా వెళ్తుందో ముందుగానే అర్థమవుతుంది.
హీరో గతాన్ని గుర్తు చేసుకునే విధానం, సన్నివేశాలను వివరంగా చూపించిన తీరు కొంత వరకు సినిమాకు ప్రత్యేకత తీసుకొచ్చినా.. అదే సమయంలో నెమ్మదిగా అనిపించింది. కథను మరింత కాంపాక్ట్‌గా చెప్పి ఉంటే ప్రభావం పెరిగేది. ఇంటర్వెల్ వరకు ఉన్న ఆసక్తి తర్వాత తగ్గుతుంది. క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కొంతవరకు హృదయాన్ని తాకుతాయి.
ALSO READ:Sivaji :ఓటీటీలో సినిమాలు చూసేవారు సోమరిపోతులు.. శివాజీ షాకింగ్ కామెంట్స్!
నటీనటుల పర్ఫార్మెన్స్ :
సంజీవ్ కుమార్‌గా శివకుమార్ కాసారం ఆకట్టుకున్నాడు. కొత్త నటుడైనా అనుభవం ఉన్న నటుడిలా కనిపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. ప్రేమికుడిగా కూడా మెప్పించాడు. సహస్రగా శ్వేత లక్ష్మణ్ తన పాత్రకు న్యాయం చేసింది. కొత్త హీరోయిన్ అనే భావన రాకుండా సహజంగా నటించింది. శివకుమార్, శ్వేత మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. మరో సహస్ర పాత్రలో వ్రజనా పాండ్యా కూడా తన పరిధిలో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు ఓకే అనిపించారు.
టెక్నికల్ టీం :
శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగ సన్నివేశాలకు బలం చేకూర్చింది. కరుణాకర్ కొట్టేటి సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ కలర్ఫుల్గా, ఆకట్టుకునేలా ఉన్నాయి. స్క్రీన్‌ప్లే, విజువల్స్‌ను మేళవించిన విధానం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్‌లు :
*హీరోహీరోయిన్ల నటన
*శేఖర్ చంద్ర సంగీతం, ఆర్ఆర్
*సినిమాటోగ్రఫీ
*కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు
*హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ
మైనస్‌లు :
*నెమ్మదిగా సాగే కథనం
*చాలా ట్విస్ట్‌లు ముందే ఊహించేలా ఉండటం
*ఎంటర్టైన్మెంట్ లేకపోవడం
*కొన్ని సన్నివేశాలను సాగదీసిన ఫీలింగ్
*క్లైమాక్స్ ముందే అర్థం కావడం
పంచ్‌లైన్ : ‘సహ’.. ప్రేమ నుంచి బాధ్యతల దాకా సాగిన సంజు ప్రయాణం!




