Shivangi Joshi:బుల్లితెరపై తన అందమైన చిరునవ్వుతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి శివాంగి జోషి. తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే నటీనటుల జీవితాల వెనుక కూడా ఎన్నో తెలియని కష్టాలు, బాధలు దాగి ఉంటాయని ఆమె తాజాగా వెల్లడించిన విషయాలు మరోసారి స్పష్టం చేశాయి.ప్రముఖ రియాలిటీ షో ‘లాక్ అప్ 2’లో పాల్గొంటున్న శివాంగి (Shivangi Joshi)తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు.
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న కుటుంబం :
‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’, ‘బర్సాత్’, ‘బడే అచ్చే లగ్తే హై 2’ వంటి సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న శివాంగి జోషి.. చిన్నతనంలో కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక సమస్యల గురించి వెల్లడించారు. తన తండ్రి వ్యాపారంలో భారీ నష్టాలు రావడంతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆ కష్టకాలంలో తన తల్లిదండ్రులు ఎంతో ధైర్యంగా కుటుంబాన్ని నడిపించారని, ప్రస్తుతం తాను కూడా కుటుంబ బాధ్యతల్లో భాగస్వామిగా ఉన్నానని శివాంగి పేర్కొన్నారు.
ALSO READ:Rana:అప్పుడు అమితాబ్ బచ్చన్..ఇప్పుడు రానా దగ్గుబాటి..ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..!
చిన్ననాటి చేదు అనుభవాన్ని బయటపెట్టిన నటి:
ఇక తన బాల్యంలో ఎదురైన ఓ బాధాకరమైన ఘటన గురించి చెబుతూ శివాంగి భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి దత్తత సోదరుడిగా పరిచయమైన వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు.నటిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న సమయంలో డ్రైవింగ్ నేర్పిస్తాననే కారణంతో తనను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేవాడని చెప్పారు. ఆ ప్రవర్తన తనకు అసౌకర్యంగా అనిపించేదని, కానీ అప్పట్లో ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం కాలేదని తెలిపారు.
ALSO READ:OTT Movie: భయపెట్టే కొరియన్ హారర్ మూవీ.. తెలుగు ఆడియోతో ఓటీటీ స్ట్రీమింగ్..!
ఎదిరించి ధైర్యంగా నిలిచిన శివాంగి:
ఒక సందర్భంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి తనతో అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని శివాంగి వెల్లడించారు. సినిమా రంగంలోకి రావాలంటే ఇలాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని చెబుతూ అతడు తప్పుగా ప్రవర్తించాడని ఆరోపించారు. దీంతో తాను ధైర్యంగా ఎదిరించి అతడిని కొట్టానని, అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు విషయం తెలుసుకుని అతడిని ఇంటి నుంచి పంపించారని కన్నీళ్లతో వివరించారు. శివాంగి వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.




